: ఏకపక్షంగా నిర్ణయించిన వేదికపై చర్చకెలా వస్తాం?: ‘పాలమూరు ఫైట్’పై రావుల అభ్యంతరం


మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు ఏకపక్షంగా నిర్ణయించిన వేదికలపై చర్చకెలా వస్తామని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. రావులతో చర్చకంటూ సహచర మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలతో కలిసి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రావుల కోసం ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించారు. వెనువెంటనే స్పందించిన రావుల టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం పెట్టారు. ‘‘మీకు మీరుగా వేదికను, తేదీలను ఎలా ఖరారు చేస్తారు? అయినా పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు నేను రాసిన లేఖకు ఇంకా సమాధానమే రాలేదు. బహుశా హరీశ్ కు నా ఆవేదన అర్థమై ఉంటుంది. అందుకే ఆయన నోరు విప్పలేదు. మందీ మార్బలంతో వచ్చి హంగామా చేస్తున్న జూపల్లి కృష్ణారావుకు వాస్తవాలు తెలియవు. అయినా ఏకపక్షంగా నిర్ణయించిన వేదికలపైకి చర్చకు ఎలా వస్తారనుకున్నారు?’’ అని రావుల అన్నారు.

  • Loading...

More Telugu News