: ‘అన్నయ్య’ పార్టీపై ‘తమ్ముడు’ విసుర్లు...కాంగ్రెస్ పై పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ సారి ‘అన్నయ్య’ మెగాస్టార్ చిరంజీవి ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రధాన సమస్య అయిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ పట్టని కాంగ్రెస్ పార్టీ, ఒక్క లలిత్ మోదీ అంశాన్ని అస్త్రంగా చేసుకుని అధికార బీజేపీపై పోరుకు దిగిందని ఆయన నిందించారు. ‘‘కాంగ్రెస్ అంటే నాకు ప్రేమ. ఆ పార్టీని ఆరాధిస్తున్నాను. ఎందుకంటే, ఒక్క లలిత్ మోదీ అంశంపై ఆ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై పోరు సాగిస్తోంది. 50 మిలియన్ల ఏపీ ప్రజలకు ఇచ్చిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ హామీ అమలు కోసం సాగించాల్సిన పోరు కంటే ఆ పార్టీకి లలిత్ మోదీ అంశమే ప్రధానమైంది. కాంగ్రెస్ ను ప్రస్తుతించండి’’ అంటూ పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.