: 2019 ఎన్నికల్లో పులివెందుల టీడీపీదే!...ఫ్యాక్షన్ కు చెక్ పెడతామన్న ఏపీ మంత్రి దేవినేని
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన ప్రకటించారు. తద్వారా కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం పాడతామని కూడా దేవినేని ప్రకటించారు. పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోతున్నాయంటే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఇటీవల తాను అక్కడ పర్యటించానని ఆయన చెప్పారు. అక్కడి ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారన్నారు. దీంతో నీళ్లిస్తే అక్కడి ప్రజలు ఎంత సంతోషిస్తారో అర్థమైందన్న దేవినేని, మరింత కసిగా పనిచేస్తున్నామని చెప్పారు. 2019లో జరిగే ఎన్నికల్లో పులివెందులలో గెలిచి తీరతామని ప్రకటించిన ఆయన, అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతామని పేర్కొన్నారు.