: ప్రశంసల వర్షంలో తడిసిముద్దవుతున్న సానియా... అభినందనలు తెలిపిన ప్రణబ్, మోదీ
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సానియాను అభినందించారు. "హార్టీ కంగ్రాచ్యులేషన్స్ సానియా మీర్జా, మార్టినా హింగిస్! సానియా ఘనత దేశంలోని యువతలో స్ఫూర్తి రగిలిస్తుంది" అని ప్రణబ్ ట్వీట్ చేశారు. ఇక, ప్రధాని మోదీ కూడా ట్విట్టర్లో స్పందించారు. "మార్టినా హింగిస్, సానియా మీర్జా చాలా బాగా ఆడారు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి వింబుల్డన్ లో మహోన్నత విజయాన్ని నమోదు చేశారు. మేమందరం ఎంతో గర్విస్తున్నాం, సంతోషిస్తున్నాం" అని పేర్కొన్నారు.