: ఎమ్మార్వో వనజాక్షి కాలుమీద కాలేసుకుని కూర్చుని ఎమ్మెల్యేతో మాట్లాడారట!
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ చీఫ్ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గౌరవించలేదని, రేవు వద్దకు ఆయన వెళ్లినప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఆమె కూర్చుని సమాధానం ఇచ్చారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు. మహిళలను తమ పార్టీ గౌరవిస్తుందని, అనుకోని పరిస్థితుల్లో రంగంపేట ఘటన జరిగిందని దేశం ఎమ్మెల్యేలు బి.రామారావు, వీరాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ముళ్లపూడి బాపిరాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ చీఫ్ విప్ ను రౌడీ, గూండా అనే అధికారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు లేదని వారు అన్నారు. ఘర్షణతో తనకు సంబంధం లేకపోయినా, వనజాక్షి కన్నీరు పెట్టుకున్న ఘటనలో ప్రభాకర్ చింతించారని గుర్తు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన ఇంటిలో ప్రభాకర్ కు, ఉద్యోగ సంఘాలకూ మధ్య రాజీ కుదిర్చిన తరువాత వీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.