: డబ్బులిచ్చి ఒబామాను కలిసిన లోకేష్ బాబు... విచారణకు పిలవనున్న అమెరికా కోర్టు!
సుమారు రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ యువనేత, చంద్రబాబు కుమారుడు లోకేష్ తన అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలసి ఆయనతో చర్చించినట్టు వార్తలు, ఫోటోలు వెలువడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఒబామాను కలిసేందుకు లోకేష్ 10 వేల డాలర్లను పెట్టి టికెట్ ను కొనుగోలు చేశారని, అధ్యక్ష ఎన్నికల కోసం జరిగిన నిధుల సమీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో లోకేష్, ఒబామాను కలిశారని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం, ఆ దేశ పౌరులు మాత్రమే ఎన్నికల నిధికి విరాళాలు ఇవ్వొచ్చు. ఒకవేళ తెలియక ఇస్తే దాన్ని సొంత ప్రచారానికి వాడుకోరాదని ఎఫ్ఈసీఏ (ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ యాక్ట్) 1971లో ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష విధించవచ్చు. విదేశీయుడైన లోకేష్ చట్టవ్యతిరేకంగా విరాళం ఇచ్చి, అధ్యక్షుడిని కలిసిన సందర్భాన్ని తన వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకొన్నారంటూ కొన్ని పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ సహా డెమోక్రాటిక్ సభ్యుడు, ఎన్నారై మాధవరం నాగేందర్ అమెరికా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, దాన్ని విచారణకు స్వీకరించినట్టు అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్ జెఫ్ జోర్డాన్ తెలిపారు. మరిన్ని ఆధారాలుంటే వెంటనే పంపాలని కూడా ఆయన కోరారు. ఫిర్యాదును ఎంయూఆర్ 6946 నంబరుతో రిజిస్టర్ చేశామని వివరించారు. ఈ కేసులో విచారణ ప్రారంభమైతే లోకేష్ కు నోటీసులిచ్చి విచారణకు రావాలని ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.