: బాలకృష్ణకు లోక్ అదాలత్ నోటీసులు
ప్రజా సమస్యల పట్ల స్పందించలేదంటూ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు లోక్ అదాలత్ నోటీసులు పంపింది. బాలయ్యతో పాటు మునిసిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, కమిషనర్ వీరభద్రరావులకు నోటీసులు పంపిన కోర్టు న్యాయమూర్తి, ఆగస్టు 1న జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, హిందూపురంలోని బైపాస్ రోడ్డు నుంచి పెనుకొండ రోడ్డుకు విస్తరణ పనులు చేపట్టాలని 1993లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అప్పటి నుంచి ఈ విస్తరణ చేపట్టలేదని పట్టణానికి చెందిన ఓ వ్యక్తి లోక్ అదాలత్ ను ఆశ్రయించాడు. ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు విస్తరణకు చొరవ చూపక పొవడంతో ప్రజలకు ఇబ్బందులు పెరిగాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో, ఈ నోటీసులు జారీ అయ్యాయి.