: గుర్తు తెలియని మృతదేహంగా శ్రీలంక తెలుగు రాజు వారసుడు


సుమారు 200 సంవత్సరాలకు పూర్వం శ్రీలంకను పాలించిన చివరి తెలుగు రాజైన విక్రమ రాజసింగ ముని ముని మనవడు మోహన రాజ సింగ మృతదేహం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని మృతదేహంగా, కనీస దహన సంస్కారాలకు నోచుకోకుండా పడివుంది. అప్పట్లో విక్రమ రాజ సింగ కుటుంబాన్ని బ్రిటీషర్లు బంధించి వేలూరు జైల్లో ఉంచగా, వారి వారసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరూ అయిపోయారు. 1965 వరకూ లంక ప్రభుత్వం వీరికి రాజభరణం అందించినప్పటికీ, ఆపై దాన్ని ఆపివేయడంతో వీరి పరిస్థితి దారుణంగా మారింది. ఆ రాజు వారసుల్లో ఒకరైన మోహన రాజ సింగ, చిత్తూరు జిల్లాలోని నరసింగరాయని పేటలోని లంకా భవన్‌ లో ఒకప్పుడు దర్జాగా బతికాడు. చివరికి బతుకుదెరువు కోసం కూలీపనులు కూడా చేసి, స్థానికులు పెట్టిన తిండి తింటూ కాలం వెళ్లదీశాడు. శుక్రవారం రాత్రి మూర్ఛవ్యాధితో మరణించగా, మేమున్నామని ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆసుప్రతి సిబ్బంది గుర్తు తెలియని మృతదేహమని పేర్కొంటూ మార్చురీలో ఉంచారు. మునిసిపల్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో శవ దహనం సాధ్యం కాలేదు. గొప్ప రాజవంశంలో పుట్టి అనామకంగా బతికి.. అనామకంగానే చనిపోయిన మోహన రాజ సింగ మృత దేహానికి ప్రైవేటు వ్యక్తులతో దహన సంస్కారాలు చేయించాలని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News