: టీసీఎస్ లో ఉద్యోగం వద్దే వద్దంటున్న ఎంప్లాయీస్... రికార్డు స్థాయికి పెరిగిన అట్రిషన్ రేటు


ఇండియాలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న టీసీఎస్ లో అట్రిషన్ రేటు (ఉద్యోగాలను వీడిపోతున్న వారి సంఖ్య) రికార్డు స్థాయికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీసీఎస్ లో ఉద్యోగం వద్దే వద్దని వెళ్లిపోయిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో 15.9 శాతం మంది సంస్థను వీడివెళ్లారు. 2014 ఆర్థిక సంవత్సరం క్యూ-1లో 10.5 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు ఇప్పుడు 15.9 శాతానికి పెరిగింది. సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 20,302 మంది కొత్తగా విధుల్లో చేరగా, మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,24,935గా ఉంది. ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేయడానికి పలు కారణాలు ఉన్నాయని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్న కారణంగా, విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి ఎక్కువ మంది రాజీనామా చేశారని, దీంతో పాటు అమెరికాలో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మంది రిజైన్ చేశారని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఐటీ శాఖలో ఉద్యోగాలు లభిస్తున్నాయని, దీంతో ఏ మాత్రం వేతనం అధికంగా వచ్చినా ఉద్యోగులు జంప్ కొడుతున్నారు. మూడు నుంచి ఆరేళ్ల అనుభవమున్న ఉద్యోగులు ఎక్కువగా రిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలకు ఇతర కంపెనీల నుంచి వస్తున్న ఆకర్షణీయ ఆఫర్లే కారణం. కాగా, సంస్థలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు టీసీఎస్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News