: అత్యాచార నిందితుల కోసం బాధితురాలిని మరోసారి పంపితే... పోలీసుల ట్రాప్ విఫలం!
అత్యాచార నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పన్నిన ట్రాప్ విఫలమైంది. ఆ బాధితురాలు మరోసారి అవమానపడాల్సి వచ్చింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ట్రాప్ పన్నిన పోలీసులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో ఓ 17 సంవత్సరాల యువతి, తన స్నేహితుడితో కలసి విహారానికి వెళితే, అతడిని చావగొట్టిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి దాన్ని ఆమె సెల్ ఫోన్లోనే వీడియో తీశారు. దీనిపై బాధితురాలు కేసు పెట్టింది. ఓ వైపు విచారణ జరుగుతుండగా, అత్యాచార వీడియో ఉన్న సెల్ ఫోన్ ఇచ్చేందుకు రూ. 2 వేలు ఇవ్వాలని నిందితులు బాధితురాలి తల్లికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. విషయాన్ని పోలీసుల చెవిని వేయగా, వినోద్ ఇజ్జాప్వార్ అనే పోలీసు అధికారి ట్రాప్ పన్నారు. బాధితురాలిని నిందితులు పిలిచిన చోటుకు వెళ్లాలని, ఆమె వెనుక తాముంటామని సూచించారు. నిందితులు చెప్పిన విధంగా, ఓ ఫ్లయ్ ఓవర్ వద్దకు ఆమె బయలుదేరగా, మార్గమధ్యంలోనే వారు అటకాయించారు. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి మరోసారి ఘోరానికి పాల్పడ్డారు. పోలీసులు ఆమెను ఫాలో కాకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేసును సీరియస్ గా తీసుకున్న ఐజీ విశ్వాస్ నాంగ్రే రంగంలోకి దిగి, ఘటన జరిగిన ప్రాంతంలో కూంబింగ్ చేయాలని ఆదేశించగా, నిందితులు దొరికారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన వినోద్ ను సస్పెండ్ చేసినట్టు ఆయన తెలిపారు.