: విద్యుత్ కేంద్రం పెట్టేందుకు ప్రజలు సహకరించాలి: అచ్చెన్నాయుడు


శ్రీకాకుళంలో విద్యుత్ కేంద్రం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే పరిశ్రమలు స్థాపించాలని అన్నారు. 4 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు పెట్టేందుకు సుమొటో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, దానిని శ్రీకాకుళం జిల్లాలో పెట్టేందుకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో ఇప్పటికే ఓ విద్యుత్ కేంద్రం ఉందని చెప్పిన ఆయన, కొత్తదాని కోసం పొలాకి మండలాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ప్రాజెక్టుకు భూ పరిశీలన కూడా జరిగినట్టు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రం పెట్టేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కాగా, కాకరాపల్లి విద్యుత్ కేంద్రం వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. దీని పట్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News