: కన్నుమూసిన ఒమర్ షరీఫ్... నేల రాలిన ధ్రువ'తార'


ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్ (83) కైరోలోని ఓ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన తనువు చాలించారు. హాలీవుడ్ తొలితరం మేటి నటుల్లో ఒమర్ కూడా ఒకరుగా పేరుగాంచారు. ఈజిప్టులో తుక్కు వ్యాపారం చేసే వారి ఇంట 1932లో ఆయన జన్మించారు. నటన మీద ఉన్న ఆసక్తితో లండన్ లోని 'రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్'లో నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. 1954లో 'సిర్రా ఫిల్-వాడి' అనే ఈజిప్టియన్ చిత్రంతో ఆయన తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఒమర్ కు రాలేదు. చే గువేరా, చెంఘిజ్ ఖాన్ తదితర గొప్ప చారిత్రక పురుషుల క్యారెక్టర్లలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్న ఒమర్ షరీఫ్... అకాడమీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. మెకన్నాస్ గోల్డ్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో, ది టెన్ కమాండ్ మెంట్స్, ది మెమొరీస్ ఆఫ్ మిడ్ నైట్ లాంటి చిత్రాలతో దూసుకుపోయారు. దాదాపు 70 చిత్రాల్లో ఒమర్ నటించారు. పుట్టుకతో గ్రీక్ క్యాథలిక్ అయిన షరీఫ్ 1955లో ఇస్లాం మతం స్వీకరించారు.

  • Loading...

More Telugu News