: నేటి సాయంత్రం టీ కేబినెట్ మీట్... ఉద్యోగ ప్రకటనల జారీపైనే ప్రధాన చర్చ


తెలంగాణ మంత్రి మండలి నేటి సాయంత్రం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో గోదావరి పుష్కరాలపై ప్రధానంగా సమీక్ష జగరనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. అందుకనుగుణంగా గోదావరి తీరం వెంట ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. మెజారిటీ ప్రాంతాల్లో ఇప్పటికే పనులు పూర్తి కాగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటిపై కేబినెట్ కూలంకషంగా చర్చించనుంది. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తవుతున్నా, ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు సర్కారు తీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాక ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా విడుదల కానున్నాయి. ఈ నోటీఫికేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కేటినెట్ కీలక చర్చ జరపనుందని సమాచారం. అంతేకాక ఉద్యోగ భర్తీలో సుదీర్ఘ విరామం వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల వయో సడలింపుపైనా నేటి భేటీలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలూ ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News