: ఇసుక ‘తుఫాన్’పై చంద్రబాబు భేటీకి కేఈ గైర్హాజరు...విభేదాలపై పుకార్ల షికారు!
ఏపీలో తహశీల్దార్ పై ప్రభుత్వ విప్ దాడి ప్రభుత్వం, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై రెవెన్యూ వర్గాలు భగ్గుమన్నాయి. చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేేస్తూ మూడు రోజులుగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పురమాయించారు. అయితే రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో కొద్దిసేపటి క్రితం ముసునూరు తహశీల్దార్, విప్ చింతమనేని సహా రెవెన్యూ అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాత్రం ఈ భేటీకి హాజరుకాలేదు. ఇప్పటికే తన సొంత జిల్లా కర్నూలుపై సీఎం చంద్రబాబు శీతకన్నేస్తున్నారని కేఈ పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా తన సొంత శాఖలో నెలకొన్న వివాద పరిష్కార బాధ్యతను తనకు కాకుండా మరో మంత్రి దేవినేని ఉమాకు అప్పగించడంపై కేఈ కాస్త ఇబ్బందికరంగా ఫీలయినట్లు సమాచారం. దీంతోనే ఆయన నేటి భేటీకి హాజరుకాలేదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.