: ‘బాహుబలి’ అదుర్స్!...జక్కన్న చిత్రంపై టీ పొలిటీషియన్స్, అధికారుల ప్రశంసలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలతో టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’పై తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. నేటి ఉదయం తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల కోసం ఐమ్యాక్స్ లో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శన కాసేపటి క్రితం ముగిసింది. చిత్రాన్ని చూసి బయటకు వచ్చిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ‘బాహుబలి’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాహుబలి’ ద్వారా జక్కన్న భారతీయ చిత్రాలను హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లారని నాయిని, స్వామిగౌడ్ కీర్తించారు. చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రదర్శనకు రాజకీయ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు.