: నాయిని పధ్ధతి సరికాదు...సమ్మె విరమించలేదు: కార్మిక సంఘాల జేఏసీ
కార్మిక సంఘాల నేతగా పని చేసిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పధ్ధతి సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు సరికాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్మికులను అణగదొక్కేందుకు ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని వారు ఆరోపించారు. సమ్మె విరమించామని చెబుతున్న టీఆర్ఎస్ కేవీతో తమకు సంబంధం లేదని అన్నారు. అసలు టీఆర్ఎస్ కేవీకి కార్మిక సంఘంగా గుర్తింపు లేదని వారు స్పష్టం చేశారు. సమ్మె విరమించలేదని, సమ్మె విరమించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వారు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేది లేదని, రేపటి నుంచి సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని వారు ప్రకటించారు.