: సెంచరీతో టీమిండియాను ఆదుకున్న రాయుడు


తెలుగు తేజం అంబటి రాయుడు టీమిండియాను ఆదుకున్నాడు. టాపార్డర్ మొత్తం పెవిలియన్ చేరుతున్నవేళ స్టువర్ట్ బిన్నితో కలిసి రాయుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రెండో సెంచరీ చేసిన రాయుడు, 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. జింబాబ్వేలోని హరారేలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రహానే (34) నిలదొక్కుకున్నప్పటికీ భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. అనంతరం రహానేకు జతకలిసిన రాయుడు (124) నిలకడగా ఆడాడు. దీంతో వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్నారన్న దశలో రహానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మనోజ్ తివారీ (2), ఉతప్ప (0), కేదార్ జాదవ్ (5) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 87 పరుగులకే టీమిండియా కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టువర్ట్ బిన్నీ (77) జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ రౌండర్ గా జట్టులో స్థానం సంపాదించుకున్న బిన్నీ జతకలవడంతో రాయుడు జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ పోయాడు. చివర్లో బిన్నీ అవుట్ కావడంతో అక్షర పటేల్ (2) మెరుపులు మెరిపించే అవకాశం లభించలేదు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 255 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ఛిబాబా, టిరిపానో రెండేసి వికెట్లతో రాణించగా, విటోరీ ఒక వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News