: రహస్యంగా జరిగిన పెళ్లి... దొంగల గుట్టును రట్టు చేసింది!


హైదరాబాదుకు చెందిన కోన ఉమా మహేష్ (24), అర్జి నవీన్ కుమార్ (28) చిన్నప్పటి నుంచి స్నేహితులు, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేసేవారు. ఇద్దరూ ఒకే వివాహితను ప్రేమించారు. ఉమా మహేష్ మరో అడుగు ముందుకేసి ఆమె అక్క కూతురిని ముగ్గులోకి దించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అమ్మాయి తరపు వారు కిడ్నాప్ కేసు పెట్టడంతో మొత్తం కథంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ తమ కోరికలను తీర్చుకునేందుకు పలు దొంగతనాలు చేశారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా, కార్ఖానా, తుకారాంగేట్‌, బోయిన్‌ పల్లి పరిధుల్లో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై ఖమ్మం జిల్లాలో 6, హైదరాబాదులో 3 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగులో ఉన్నాయి. భర్త నుంచి వేరుపడిన మీనా అనే యువతితో వీరికి పరిచయం ఏర్పడింది. మీనా ద్వారా ఆమె అక్క కూతురిని కలుసుకొని ఉమా మహేష్ మాయమాటలు చెప్పి కొద్ది రోజుల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆమె బంధువులు తమ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు దొంగతనం కోణం తెలిసింది. పలు కేసుల్లో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇద్దరు దొంగలనూ అరెస్ట్ చేశారు. వారి నుంచి 85.8 గ్రాముల బంగారు, 56 గ్రాముల వెండి, ఒక ట్యాబ్‌, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరు పరచనున్నామని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News