: దొంగకు తండ్రయినా నిజాయతీ ప్రదర్శించాడు... పోలీసులకు శ్రమ తగ్గించాడు!
పూణేలోని మందాయ్ ప్రాంతంలోని సుప్రసిద్ధ శారదా గణపతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. రూ.44 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఓ దొంగ బుధవారం ఉదయం కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. అయితే, ఆ మరుసటి రోజే నగరంలోని కొత్రూడ్ పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. పోలీసులకు శ్రమ తగ్గిస్తూ, చోరీకి గురైన ఆభరణాల్లో చాలా ఆభరణాలను అప్పగించాడా వ్యక్తి . ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగ తండ్రే ఆ వ్యక్తి. తన కొడుకు ఎత్తుకువచ్చిన ఆభరణాలను అతడు నిజాయతీగా అప్పగించడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఆ రోజు తన కొడుకు తప్పతాగి వచ్చాడని, అతని వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉండడం గమనించానని తండ్రి తెలిపాడు. ఇక, ఆ దొంగ విజయ్ కుందాలేను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.