: కేసీఆర్, టీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయిన రేవంత్ రెడ్డి
టీటీడీపీ నేత, ఓటుకు నోటు కేసులో ఏ-1 ముద్దాయి అయిన రేవంత్ రెడ్డి మరోసారి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. నిరంకుశ వైఖరితో ముందుకెళ్తూ, ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు బంద్ చేస్తాయి కానీ, ఇక్కడ మాత్రం అధికారపక్షమే బంద్ చేస్తోందని ఎద్దేవా చేశారు. అసలు ఏ ఉద్దేశంతో బంద్ చేస్తోందో తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వడం అనాగరికమని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిన తర్వాత కూడా... సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.