: రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఇస్తోంది: కిషన్ రెడ్డి
పవిత్ర రంజాన్ ను పురస్కరించుకుని టి.ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. రాజకీయ ఎజెండాతో ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఇవ్వడం సరికాదన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం ఈ తరహా వ్యవహారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇఫ్తార్ విందు ఇవ్వడం తప్పు కాదని, అయితే రాజకీయ లక్ష్యంతో ఇవ్వడమే కరెక్టు కాదన్నారు. ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే రకరకాల వరాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. మసీదులలో ఉండే మౌజీలకు పెన్షన్లు ఇవ్వడం, ఇతర రాయితీలు ఇవ్వడం వంటివి ప్రభుత్వంపై భారం పెంచుతాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏదైనా మతపరంగా చేయడం సరికాదని కిషన్ రెడ్డి సూచించారు. ఓ వైపు రంజాన్ సందర్భంగా కానుకలు ప్రకటించిన ప్రభుత్వం పుష్కరాలకు వెళ్లే భక్తులపై మాత్రం అదనపు చార్జీలు వసూలు చేయాలనుకుంటోందని విమర్శించారు.