: 'బాహుబలి'కి నకిలీ మకిలి!
ప్రభాస్, రానా నటించిన బాహుబలి చిత్రంపై అభిమానుల్లో ఉన్న క్రేజును క్యాష్ చేసుకునేందుకు నకిలీ టికెట్ల ముఠా రంగంలోకి దిగింది. అచ్చు థియేటర్లు జారీ చేసిన టికెట్ల తరహాలోనే నకిలీ టికెట్లు ముద్రించి విశాఖలోని పలు థియేటర్ల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వేల రూపాయలకు అమ్మేశారు. డబ్బు పోయినా, తొలి రోజు సినిమా చూస్తామన్న ఆనందంతో థియేటర్ల దగ్గరకు చేరుకున్న అభిమానులు అసలు విషయం తెలిసి గొడవకు దిగారు. తాము థియేటర్ల దగ్గరే వీటిని కొనుగోలు చేశామని అభిమానులు అంటుండగా, ఇవి తాము జారీ చేసినవి కాదని థియేటర్ల యాజమాన్యం చెబుతోంది. నకిలీ టికెట్లను కొనుగోలు చేసిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో సినిమా హాల్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థియేటర్ల యాజమాన్యాలే తమకు నకిలీ టికెట్లు విక్రయించారని ఆరోపిస్తూ, పలువురు నిరసనలకు దిగారు. పలు థియేటర్ల వద్ద ఇటువంటి ఘటనలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.