: గ్రీసులో దారుణ పరిస్థితి... దినపత్రికల ముద్రణకు కాగితం కొరవడింది!
ఆర్థిక సంక్షోభం కారణంగా చతికిలబడిన గ్రీస్ లో క్రమేణా దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ గా ఖ్యాతి పొందిన మీడియాకు కడగండ్లు మొదలయ్యాయి. దేశంలోని దినపత్రికలు ముద్రించేందుకు కాగితం కొరత ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం, బ్యాంకులు మూతపడడం వంటి కారణాలతో కుదేలైన రంగాల్లో మీడియా కూడా ఒకటి. దేశంలో ప్రముఖ పత్రికలుగా పేరుగాంచిన 'ఎంప్రోస్ డైలీ', 'ఐలాండ్ ఆఫ్ లెస్వోస్' తాత్కాలికంగా మూతపడనున్నాయి. ఈ పత్రికల కార్యాలయాల్లో న్యూస్ ప్రింట్ నిండుకుంది. బ్యాంకులు తెరుచుకుంటే గానీ, కాగితం కొనుగోలు కోసం లావాదేవీలు నిర్వహించేందుకు మార్గం సుగమం కాదు. ఇప్పటికే ఎంప్రోస్ పత్రిక తక్కువ పేజీలతో నెట్టుకొస్తోంది. 20 పేజీల నుంచి 16 పేజీలకు పడిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే న్యూస్ పేపర్ ముద్రణ ఆగిపోనుంది. దీనిపై పత్రిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనోలిస్ మనోలాస్ స్పందించారు. కాగితం సరఫరాకు సమస్యలు ఏర్పడ్డాయని ఫోన్ ద్వారా మీడియాకు ప్రతినిధికి వివరించారు. తమకు కాగితం సప్లై చేసే సంస్థ విదేశీ సరఫరాదార్లకు చెల్లింపులు చేయలేకపోతోందని, దాంతో, తాము న్యూస్ ప్రింట్ కొరత ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. దాదాపు గ్రీస్ లోని అన్ని న్యూస్ పేపర్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.