: బద్దలైన 'మౌంట్ రాంగ్'... ఇండోనేషియాలో ఎయిర్ పోర్టుల మూసివేత
ఇండోనేషియాలో ఇప్పుడు ఓ రకమైన అత్యయిక స్థితి నెలకొంది. బాలి, లొంబోక్, బ్లింబింగ్సారి, బన్యువాంగి, జెంబెర్ ఎయిర్ పోర్టులను మూసివేశారు. తూర్పు జావాలోని మౌంట్ రాంగ్ అగ్నిపర్వతం బద్దలవడమే అందుకు కారణం. ఆ అగ్నిపర్వతం నుంచి భారీస్థాయిలో బూడిద విడుదలై ఆకాశానికి ఎగసింది. ఈ బూడిద వందల మైళ్ల దూరానికి వ్యాపించడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆకాశం నిండా ధూళిమేఘాలు పరుచుకున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించిన పిదప విమాన సర్వీసుల విషయమై నిర్ణయం తీసుకుంటామని దేశంలోని పలు విమానయాన సంస్థలు తెలిపాయి. ఈ బూడిద కారణంగా వరుసగా రెండో రోజు కూడా ఆస్ట్రేలియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆస్ట్రేలియన్లకు ఇండోనేషియా టాప్ హాలిడే స్పాట్ గా నిలుస్తోంది. తాజా పరిస్థితిపై ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ అధికారి జేఏ బరాతా మాట్లాడుతూ... మౌంట్ రాంగ్ అగ్నిపర్వతం తీరుతెన్నులను పరిశీలించిన మీదట ఎయిర్ పోర్టులు తెరిచే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.