: నాది బకరా బతుకు అయిపోయింది... దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వైరాగ్యం!
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా తహశీల్దార్ పై దాడి చేయించి విమర్శల జడివాన ఎదుర్కొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. తనది బకరా బతుకైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేసే వారెవరైనా సరే సహించేది లేదని సొంత పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలతో కంగారెత్తిపోయిన చింతమనేని దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నిన్న రాత్రి ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన తహశీల్దార్ వనజాక్షి కంటతడిపెట్టడం తనను కలచివేసిందని చెప్పారు. తహశీల్దార్ పై దాడితో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయినా, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు, రెవెన్యూ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగిన సందర్భంగా కింద పడ్డ తహశీల్దార్ ను తానే పైకి లేపానని చెప్పారు. అయినా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, చివరకు తనది బకరా బతుకు అయిపోయిందని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు.