: నాకేమీ తెలియదు...6 గంటల విచారణలో 70 ప్రశ్నలకు ‘సండ్ర’ సమాధానమిదేనట!
ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై నిన్న తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన విచారణలో సండ్ర 70 ప్రశ్నలను ఎదుర్కొన్నారట. అయితే మెజారిటీ ప్రశ్నలకు తనకేమీ తెలియదని సండ్ర సమాధానమిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తమ ముందు విచారణకు వచ్చిన సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ, కోర్టు అనుమతితో నిన్న తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా సాగింది. విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదనే సండ్ర చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘నాకేమీ తెలియదు. నేను ఎమ్మెల్యేను. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని. నాకు రోజూ ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అందులో సగం మందిని చూస్తే గాని గుర్తుపట్టలేని పరిస్థితి’’ అంటూ సండ్ర తన వాదనను వినిపించారట. ఇక రెండో రోజు కస్టడీలో భాగంగా మరికాసేపట్లో సండ్రపై ఏసీబీ అధికారులు మరోమారు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.