: ‘బాహుబలి’పై క్రిటిక్స్ ప్రశంసల వర్షం... మాస్టర్ పీసేనన్న కరణ్ జోహార్
దాదాపు రెండున్నరేళ్ల కసరత్తు తర్వాత నేటి ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’పై క్రిటిక్స్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తెలుగు చలన చిత్రసీమలోనే కాక యావత్తు భారత సినీ జగత్తులో ఈ చిత్రం ఓ మాస్టర్ పీస్ గా నిలిచిపోతుందని క్రిటిక్స్ పేర్కొన్నారు. దాదాపు నాలుగు వేల థియేటర్లలో నేటి ఉదయం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్ల ముందు బారులు తీరేలా చేసింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ హక్కులు దక్కించుకున్న కరణ్ జోహార్ ‘బాహుబలి’ని మాస్టర్ పీస్ గా అభివర్ణించారు.‘‘మన కాలంలో వచ్చిన అద్భుతమైన మాస్టర్ పీస్ గా ఈ చిత్రం నిలిచినందుకు గర్వంగానే కాక గౌరవంగానూ ఉంది’’ అని కరణ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇక ప్రముఖ సినీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా ‘బాహుబలి’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎస్ఎస్ రాజమౌళి దగ్గరగా ఏ దర్శకుడు రాలేడు. ‘బాహుబలి’ నిజంగా మాస్టర్ పీసే. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమూ, ప్రతి సీనూ అద్భుతమే. హాలీవుడ్ లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని అద్భుత చిత్రాలతో దీనిని సరిపోల్చవచ్చు. ఒక మేధావి బుర్ర నుంచి వచ్చిన ముద్ర ఈ చిత్రానికి ఉంది. ప్రభాస్, రానా దగ్గుబాటి యాక్షన్ సూపర్బ్. చిత్రంలోని ఇతర తారాగణం కూడా వారి పాత్రల్లో జీవించారు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.