: చిత్తూరు నాయుడు, వెంకయ్య నాయుడులను నిలదీయాలి: సీపీఐ రామకృష్ణ
టీడీపీ ఎంపీలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిస్తే, ఆయనపై ఎదురుదాడికి దిగడం టీడీపీ ఎంపీలకు తగదని అన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తూరు నాయుడు (చంద్రబాబు), వెంకయ్య నాయుడులను నిలదీయాలని సూచించారు. ఎంపీలు ప్రత్యేక హోదా సాధించి చూపాలని, లేకుంటే పదవుల నుంచి వైదొలగాలని అన్నారు. ఇక, హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేసినా, చేయకపోయినా ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, కేసీఆర్ సెక్షన్ 8పై రగడకు తెరదీశారని రామకృష్ణ ఆరోపించారు.