: కోహ్లీకి 'మిస్టర్ ఇండియా' అయ్యే లక్షణాలున్నాయి: జహీర్ ఖాన్
ఒకప్పుడు టీమిండియాకు ప్రధాన బౌలర్ గా విలసిల్లిన జహీర్ ఖాన్ ఇప్పుడు క్రికెట్ తో పాటు అనేక వ్యాపారాలతో తలమునకలుగా ఉన్నాడు. తాజాగా, 'మిస్టర్ ఇండియా' కాంటెస్ట్ కు అధికారిక ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ గా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా జాక్ మీడియాతో ముచ్చటించాడు. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థుల ఫిట్ నెస్ వ్యవహారాలు పర్యవేక్షించడమే తన విధి అని తెలిపాడు. ప్రస్తుత భారత జట్టులో 'మిస్టర్ ఇండియా' అయ్యే లక్షణాలున్న క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు జవాబిస్తూ... విరాట్ కోహ్లీకి 'మిస్టర్ ఇండియా' లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. లక్ష్యాలను చేరుకునేందుకు కఠోరంగా శ్రమించడం, ఎంచుకున్న మార్గం పట్ల స్పష్టత, ఇప్పటికే తన క్రీడలో యోధుడిగా పేరుగాంచడం... కోహ్లీని 'మిస్టర్ ఇండియా'గా నిలపగలవని అభిప్రాయపడ్డాడు.