: 'వ్యాపం' స్కాంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం, అనుమానాస్పద మరణాలపై సీబీఐ విచారణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసు దర్యాప్తును అత్యున్నత న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. స్వయంగా తాము దర్యాప్తును పర్యవేక్షిస్తామని తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలువురు దాఖలు చేసిన 9 పిటిషన్ లను విచారణకు స్వీకరించిన కోర్టు పైవిధంగా స్పందించింది. ఇదే సమయంలో స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ను తొలగించాలంటూ కొంతమంది న్యాయవాదుల బృందం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. ఈ క్రమంలో గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.