: హేమలత ప్రారంభించిన చిన్న కంపెనీలో రతన్ టాటా పెద్ద పెట్టుబడి!
సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే చిన్న స్టార్టప్ సంస్థను మొదలు పెట్టిన అన్నామలై హేమలతకు రతన్ టాటా వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె ప్రారంభించిన సంస్థ భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుతుందని నమ్మిన ఆయన భారీ పెట్టుబడిని అందించారు. కోయంబత్తూరు కేంద్రంగా హేమలత 'ఆంపిరే' పేరిట పరిశ్రమను స్థాపించగా, ఆమె ఆలోచన నచ్చి ఫోరం సినర్జీస్, స్పెయిన్ కు చెందిన ఆక్సన్ కాపిటల్ లు భాగస్వాములుగా వచ్చి చేరాయి. రతన్ టాటా ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించిన హేమలత, ఆ డబ్బుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఆటోల తయారీ పెద్దఎత్తున చేపట్టనున్నామని వివరించారు. కాగా, రతన్ టాటా ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఓలా, స్నాప్ డీల్, పేటీఎం, క్సియోమీ వంటి కంపెనీలతో పాటు కార్ దేఖో డాట్ కాం వంటి వెబ్ సైట్లలో ఆయన ఇన్వెస్ట్ చేశారు.