: ఆన్ లైన్లో కొనుగోలు చేస్తే రూ. 13 లక్షలకే మెట్రో నగరాల్లో సొంతిల్లు: టాటాల ఆఫర్
ప్రముఖ నిర్మాణ రంగ దిగ్గజం టాటా హౌసింగ్ ఏడు నగరాల్లోని 11 ప్రాజెక్టుల్లో ఉన్న 200కు పైగా అపార్టుమెంట్లను ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి ఉంచింది. ఈ నెల 13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు ఆన్ లైన్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా రూ. 13 లక్షల నుంచే సొంతిల్లును పొందవచ్చని సంస్థ ఎండీ బ్రోటిన్ బెనర్జీ తెలిపారు. ముంబై, కోల్ కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయని, గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకూ అపార్టుమెంట్ల ధర ఉంటుందని వివరించారు. కాగా, ఆన్ లైన్లో కొనుగోలు చేస్తే మధ్యవర్తులకు వెళ్లే కమిషన్ల భారం లేకపోవడంతోనే సాధారణ ధరతో పోలిస్తే 30 శాతం వరకూ తక్కువ ధరలకు సొంతిల్లు లభిస్తుందని ఇప్పటికే పలు రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. టాటా సన్స్ అనుబంధ సంస్థగా ఉన్న టాటా హౌసింగ్ నిర్మిస్తున్న 1500 ఇళ్లను 2014లో ఆన్ లైన్ మాధ్యమంగా కస్టమర్లు బుక్ చేసుకోవడం గమనార్హం.