: రికార్డు స్థాయి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు... 5.2 సెకెన్లలో 47 వేల ఫోన్లు సేల్
'లెనోవా' కొత్త మోడల్ 'కే3 నోట్' స్మార్ట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడై సంచలనం సృష్టిస్తోంది. కేవలం 5.2 సెకెన్లలో 47 వేల ఫోన్లను విక్రయించి లెనోవా సత్తా చాటింది. తాజాగా విడుదల చేసిన లెనోవా 'కే3 నోట్' ఫోన్ కు వినియోగదారుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. గత నెల కే3 నోట్ పోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసిన లెనోవా, నేడు 'ఫ్లిప్ కార్ట్'లో అమ్మకానికి పెట్టింది. మద్యాహ్నం 3 గంటలకు అమ్మకాలు ప్రారంభించగా, విక్రయాలు ప్రారంభమైన 5.2 సెకెన్లలోనే 47 వేల ఫోన్లు అమ్ముడైనట్టు లెనోవా తెలిపింది. ఈ ఫోన్ కోసం ముందస్తు రిజస్ట్రేషన్లు కూడా 5 లక్షలు దాటినట్టు లెనోవా వెల్లడించింది. లెనోవా కే3 నోట్ స్మార్ట్ ఫోన్ ధర 9,999 రూపాయలు కాగా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమేరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 5.5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 2జీబీ ర్యామ్, 4 జీ సపోర్ట్, డ్యుయల్ సిమ్ సౌకర్యం. ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ ఓఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందని లెనోవా చెప్పింది.