: హేమమాలిని వల్లే ప్రమాదం జరిగింది: చిన్నారి తండ్రి ఆగ్రహం
ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని కారు వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రమాదంలో మృతి చెందిన బాలిక తండ్రి స్పష్టం చేశారు. హేమమాలిని ట్వీట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ, తాను సరైన మార్గంలోనే వస్తున్నానని, హేమా కారు మితిమీరిన వేగంతో రావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. హేమమాలిని తప్పుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తరువాత ఆమె మరో కారెక్కి వెళ్లిపోయారని, నడి రోడ్డుపై రక్తమోడుతున్న తన కుమార్తెను పట్టించుకోలేదని ఆరోపించారు. తన కుమార్తెను కూడా అదే సమయంలో ఆసుపత్రికి తరలించి ఉంటే మృతి చెంది ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న హేమమాలిని ఇలా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాగా, గత వారం రాజస్థాన్ లోని దౌసాలో రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హేమమాలిని కారు అతి వేగంతో వచ్చి, ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో, రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే.