: డబ్బు వసూలు చేయడానికే దావా వేశారు: రజనీకాంత్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాపై ధ్వజమెత్తారు. వియ్యంకుడు కస్తూరి రాజా రూ.65 లక్షల అప్పు చేస్తే, ఆ డబ్బు తన నుంచి వసూలు చేసేందుకు బోత్రా ప్రయత్నించారని, అందుకే కోర్టులో దావా వేశారని రజనీకాంత్ ఆరోపించారు. కస్తూరిరాజా తీసుకున్న రుణానికి తాను హామీదారుగా లేనని ఆయన స్పష్టం చేశారు. అటు, ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా భిన్న వాదన వినిపిస్తున్నారు. కస్తూరిరాజా 2012లో 'మై హూ రజనీకాంత్' అనే హిందీ చిత్రం కోసం తొలుత రూ.40 లక్షలు తీసుకున్నారని, ఆ తర్వాత రూ.25 లక్షలు అడిగారని బోత్రా వివరించారు. ఒకవేళ తాను ఆ అప్పు తీర్చలేకపోతే, తన కుమారుడు ధనుష్ మామ అయిన రజనీకాంత్ చెల్లిస్తాడని కస్తూరిరాజా స్పష్టంగా చెప్పారని బోత్రా తెలిపారు. అందుకే దావా వేశామని అన్నారు. కాగా, దావా నేపథ్యంలో కోర్టు రజనీకి నోటీసులు పంపింది. వాటికి సమాధానమిస్తూ... తనను అప్రదిష్ఠ పాల్జేసి, డబ్బు వసూలు చేయడానికి బోత్రా దావా వేశాడని సూపర్ స్టార్ పేర్కొన్నారు.