: షరపోవా కేకలు... నిర్వాహకులకు మొరపెట్టుకున్న ఫ్యాన్స్
రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా కోర్టులో దిగితే రాకెట్ కే కాదు, నోటికీ పని చెబుతుంది. ఆమె అరుపులే ప్రత్యర్థిని సగం బెంబేలెత్తిస్తాయి. తాజాగా, వింబుల్డన్ టెన్నిస్ కోర్టుల్లోనూ ఆమె గళం విప్పింది. దాదాపు 101 డెసిబుల్స్ శబ్ద స్థాయి నమోదయ్యిందంటేనే అర్థం చేసుకోవచ్చు అమ్మడి కేకల పవరేంటో. అమెరికా అమ్మాయి కోకో వాండెవేగ్ తో మ్యాచ్ లో ఈ పొడుగుకాళ్ల సుందరి తీవ్రస్థాయిలో అరుపులకు దిగడంతో అభిమానులు బెంబేలెత్తిపోయారట. టీవీల్లో మ్యాచ్ ను వీక్షించిన వాళ్లు, షరపోవా కేకలు భరించలేక టీవీలు ఆఫ్ చేసుకున్నారట. ఇక, మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూసిన వారి పరిస్థితి సులభంగానే ఊహించవచ్చు! వారు వెంటనే వెళ్లి టోర్నీ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఆమె కేకలు భరించలేకపోతున్నాం మహాప్రభో అంటూ మొరపెట్టుకున్నారు. మరి, దీనిపై వింబుల్డన్ నిర్వహిస్తున్న ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!