: ఐపీఎల్ కు బీసీసీఐ మద్దతిస్తున్నట్టే ఐఎస్ఎల్ కు ఏఐఎఫ్ఎఫ్ తోడ్పాటునివ్వాలి: గంగూలీ
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫుట్ బాల్ అంటే ఎంతో ఆసక్తి కనబరుస్తాడు. క్రికెట్ కంటే ముందు గంగూలీ సాకర్ మైదానంలోనే ఎక్కువ సేపు గడిపేవాడట. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుని, అటుపై జాతీయ జట్టుకు ఎంపికైనా గానీ సాకర్ పై మమకారం వీడలేదు. అడపాదడపా ఫుట్ బాల్ జెర్సీ ధరించి మైదానంలో ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పటికీ అంతే! భారత ఫుట్ బాల్ ప్రపంచ స్థాయికి చేరాలన్నది ఈ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా ఆకాంక్ష. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో 'అట్లెటికో డి కోల్ కతా' జట్టుకు సహ యజమానిగా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన గంగూలీ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ... ఏ క్రీడ అయినా జాతీయస్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ విజయవంతం కావడమనేది మొత్తం వ్యవస్థకు చెందిన మౌలికవసతులపై ఆధారపడి ఉంటుందన్నారు. "ఐఎస్ఎల్ కేవలం రెండు నెలలు పాటు సాగే టోర్నీ. భారత్ లో ఫుట్ బాల్ అభివృద్ధి చెందాలంటే మాత్రం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. క్రికెట్ లో చూడండి!... ఐపీఎల్ కు బీసీసీఐ మద్దతిస్తుంది. ఏఐఎఫ్ఎఫ్ కూడా అదే రీతిలో తోడ్పాటు అందించాలి" అని పేర్కొన్నారు. ఇక, ఐఎస్ఎల్ భారత ఫుట్ బాలర్లకు గొప్ప వేదిక అని కొనియాడారు.