: విమానంపై తేనెటీగల ప్రతాపం
రష్యాలో ఓ విమానంపై తేనెటీగలు ప్రతాపం చూపాయి. నుకోవా ఎయిర్ పోర్ట్ నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న రోసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, తేనెటీగల సమూహం ఒక్కసారిగా దాడి చేసింది. విమానానికి చెందిన ఓ రెక్క కింద నుంచి ఎగురుతూ వచ్చిన తేనెటీగలు కిటీకీలపై వాలి వాటిని పూర్తిగా కప్పేశాయి. అంతేకాదు, ఓ రెక్కను సైతం కప్పేశాయి. దీంతో, ప్రయాణికుల కోసం ముందు జాగ్రత్తగా రెండు అంబులెన్సులను పిలిపించారు. ఇక, తేనెటీగల పనిబట్టేందుకు రంగంలోకి దిగిన ఎయిర్ పోర్టు సిబ్బంది సఫలమయ్యారు. విమానం ఫ్యూసిలేజ్ వద్ద ఉన్న తేనెటీగలను సమర్థంగా తొలగించారు. దాంతో విమానం ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది. విమానం లోపలికి ఆ తేనెటీగలు ప్రవేశించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.