: టీఆర్ఎస్ కు పోటీ టీడీపీనే!: నారా లోకేశ్


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పోటీ తామేనని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉత్తర తెలంగాణ నేతలతో భేటీ అయిన లోకేశ్, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఉప ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 9 ఎంపీటీసీ స్థానాలకు మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాలుగింటిలో విజయం సాధించింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన నారా లోకేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో టీడీపీ కేడర్ పటిష్ఠంగా ఉంది. ఎవరూ పట్టించుకోకపోయినా నాలుగు ఎంపీటీసీలను కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో టీఆర్ఎస్ కు పోటీనిచ్చేది టీడీపీనే. ఎంపీటీసీ ఎన్నికలకు స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు క్యాంపులు నిర్వహించారు. అక్రమ కేసులు, అరెస్టులు అంటూ కేసీఆర్ సర్కారు టీడీపీ కేడర్ ను భయపెట్టింది. ఇలాంటి సమయంలో నాలుగు ఎంపీటీసీలను పార్టీ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు మన సొంతమవుతాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి’’ అంటూ నారా లోకేశ్ పార్టీ నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News