: 2005లో రూ. 5 వేలు... ఇప్పుడు రూ. 18.85 లక్షలై ఉండేది!
అవును. మీరు చూసింది నిజమే. సరిగ్గా పదేళ్ల నాడు రూ. 5 వేల పెట్టుబడి పెట్టి వుంటే ఇప్పుడది రూ. 18.85 లక్షల రూపంలో చేతుల్లో ఉండేది. భారత చరిత్రలో ఇంత అధిక రాబడులను ఇచ్చిన సంస్థ మరొకటి లేదు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటనుకుంటున్నారా? అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఎయిర్ కూలర్లను మార్కెటింగ్ చేస్తున్న సింఫనీ లిమిటెడ్. జనవరి 3, 2005లో ఈ సంస్థ ఈక్విటీ వాటా విలువ రూ. 5.09 మాత్రమే. ఆ సమయంలో ఓ 1000 షేర్లు కొని పక్కన పడేసి వుంటే... సింఫనీ ఈక్విటీ విలువ నిన్నటి సెషన్లో రూ. 1,885ను దాటింది. అంటే ఈక్విటీ విలువ 36,934 శాతం పెరిగిందన్నమాట. ఈ ధరపై వాటాలను అమ్ముకుంటే రూ. 18.85 లక్షలు చేతిలో ఉన్నట్టే. ఇదసలు ఊహకే అందడం లేదు కదూ. ఒక్క సింఫనీ మాత్రమే కాదు, మరెన్నో కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని వందల రెట్లు పెంచాయి. వాటిల్లో సెరా శానిటరీ వేర్, వాడిలాల్ ఇండస్ట్రీస్, హిటాచీ హోం అండ్ లైఫ్ సొల్యూషన్స్ తదితర కంపెనీలున్నాయి. వీటి ఈక్విటీ విలువలు 2005తో పోలిస్తే వరుసగా 5,163 శాతం, 4,250 శాతం, 3,830 శాతం పెరిగాయి. అలంబిక్ ఫార్మాస్యుటికల్స్, అతుల్, జైడస్ వెల్ నెస్, అతుల్ ఆటో తదితర సంస్థలు 1000 శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే జనవరి 3, 2005న 6,679 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ సైతం 321 శాతం పెరిగింది. రూ. 7 వేల వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర 279 శాతం పెరిగి రూ. 26,570కి చేరింది. అయితే, వచ్చే పదేళ్లూ ఇటువంటి రాబడులే ఉంటాయని భావించడానికి మాత్రం వీల్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.