: పవన్ కల్యాణ్ లేకుంటే, టీడీపీకి అధికారం దక్కేదా?: టీడీపీపై జనసేన ఆగ్రహం
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమ అధినేతపై టీడీపీ ఎంపీలు చేసిన ఎదురు దాడిని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకూ దిగారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో జనసేన కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతేకాక పవన్ కల్యాణ్ ప్రచారం చేయకుంటే, ఏపీలో టీడీపీకి అధికారం దక్కేదా? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాలేని టీడీపీ ఎంపీలు... దానిని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎలా చేస్తారని నిలదీశారు. దమ్ముంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని వారు సవాల్ విసిరారు.