: టెలికాం ఉన్నతోద్యోగి దాష్టీకం... కన్న కూతురు శరీరంపై వాతలు పెట్టిన వైనం
కేంద్ర టెలికాం శాఖలో ఉన్నతోద్యోగం వెలగబెడుతున్న రమేశ్ అనే వ్యక్తి కర్కశుడిగా మారాడు. రెండో భార్యతో కలిసి తొలి భార్య ద్వారా పుట్టిన కన్నకూతురిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. పనిమనిషి కంటే హీనంగా చూస్తూ కన్న మమకారాన్ని మరిచి కూతురు శరీరమంతా వాతలు పెట్టాడు. సిగరెట్ పీకలతో తండ్రి పెట్టిన వాతలను ఆ చిన్నారి పంటి బిగువునే భరించింది. భరించింది అనే కంటే ఆ బాలిక అప్రకటిత నిర్బంధంలో మగ్గిపోయింది. పోలీసుల సహకారంతో బాలల హక్కుల సంఘం ఎట్టకేలకు కాలయముడు లాంటి కన్నతండ్రి నుంచి ఆ బాలికకు విముక్తి కల్పించింది. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో నేటి ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది. కన్నతండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో బాలిక శరీరమంతా కమిలిపోయింది. బాలిక సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్ట్ చేయగా, రమేశ్ మాత్రం పరారీలో ఉన్నాడు.