: చేతులెత్తేసిన సహారా... ఏ కంపెనీ కూడా 18 నెలల్లో రూ. 36 వేల కోట్లు కట్టలేదని సుప్రీంలో వాదన


సుప్రీంకోర్టు ముందుగా ఆదేశించిన విధంగా ఏడాదిన్నరలో రూ. 36 వేల కోట్లను చెల్లించలేమని, అసలు ఏ వ్యాపార సంస్థ కూడా ఇంత తక్కువ సమయంలో అంత మొత్తాన్ని చెల్లించలేదని సహారా తరపు న్యాయవాదులు సుప్రీంలో తమ వాదనలు వినిపించారు. సహారా తరపున వాదించిన కపిల్ సిబల్, నగదు చెల్లింపుల్లో వివాదమే లేదని, తమ సంస్థ అందరికీ తిరిగి చెల్లింపులు చేస్తుందని, గడువుపై పరిమితులు తీసేయాలని కోరారు. అంతకుముందు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ. 36 వేల కోట్లనూ 18 నెలల్లో 9 దఫాలుగా కోర్టుకు డిపాజిట్ చేయాలని సుప్రీం సూచించింది. దీనికి అంగీకరిస్తే సుబ్రతారాయ్ కి బెయిలిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఏ మూడు ఇన్ స్టాల్ మెంట్లను చెల్లించకపోయినా, ఆయనతో పాటు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఇద్దరు డైరెక్టర్లనూ కస్టడీలోకి తీసుకుంటామని హెచ్చరించింది. గత సంవత్సరం మార్చి నుంచి జైల్లో ఉన్న రాయ్ కోర్టు ఆదేశించిన విధంగా రూ, 10 వేల కోట్లను డిపాజిట్ చేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకూ రూ. 5,120 కోట్లను మాత్రమే కట్టారు. మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో పలు ప్రాంతాల్లో సహారా పేరిట ఉన్న ఆస్తులను విక్రయానికి పెట్టారు. గోరఖ్ పూర్ లో 44 ఎకరాల్లో ఉన్న సహారా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ ను విక్రయానికి ఉంచగా, రూ. 110 కోట్లకు ఆఫర్ వచ్చిందని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News