: నాడు నమ్రతది ఆత్మహత్యన్నారు... నేడు హత్యని అనుమానం!


మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకుందని భావించిన 19 సంవత్సరాల వైద్య విద్యార్థిని నమ్రతా దామోర్ ఉదంతం మరో మలుపు తిరిగింది. ఈ ఘటన 2012లో జరుగగా, 2014లో నమ్రతది ఆత్మహత్యని కేసు మూసేశారు. ఆ ఘటన 'వ్యాపమ్' హత్యేనన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తాయి. ఈ కేసులో కొత్త సాక్ష్యాలు లభిస్తే మరోసారి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వ్యాపమ్ స్కాములో నమ్రత కూడా నిందితురాలు. ఓ మెడికల్ కాలేజీలో అక్రమ పద్ధతుల్లో ఆమె సీటు సంపాదించారని కేసు నమోదైంది. నమ్రత హత్యపై కథనాలు రాస్తున్న జర్నలిస్టు గత శనివారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నమ్రత మరణం వెనుక మిస్టరీ దాగివుందని, మరోసారి విచారించాలన్న డిమాండుకు మద్దతు పెరుగుతోంది. ఈ మరణాలన్నింటిపైనా మరోసారి దర్యాప్తు చేయాలని వ్యాపమ్ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మరణాల వెనుక మిస్టరీ దాగుందని భావించలేముగానీ, ఇవన్నీ అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నవేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2012 నుంచి వ్యాపమ్ కేసులో ఎంతోమంది బాధితులు, నిందితులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News