: మా సంగతి సరే, మరి నువ్వెందుకు ప్రధానిని అడగలేదు?: పవన్ కు కేశినేని సూటి ప్రశ్న
సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీయే అద్భుతంగా పని చేస్తున్నానని తనను మెచ్చుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రతన్ టాటాను ఒప్పించి నియోజకవర్గం మొత్తాన్ని దత్తత తీసుకునేలా చేశానని అన్నారు. అయినా పవన్ కల్యాణ్ మెచ్చుకుంటాడని తాము పని చేయడం లేదని, ప్రజల కోసం పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు లోక్ సభలో 11 మంది ఎంపీలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడామని, ప్రశ్నించామని, అర్థించామని అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన ఫ్లై ఓవర్ కు అనుమతులు తెచ్చామని ఆయన చెప్పారు. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు నాలుగు లేన్ల రోడ్డు పనులు ప్రారంభించామని ఆయన చెప్పారు. విజయవాడలో అద్భుతమైన విమానాశ్రయాన్ని తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ మీ కళ్లకు కనబడడం లేదా? అని ఆయన నిలదీశారు. ప్రజా సేవ అంటే ఆరు నెలలకోసారి రిలీజయ్యే సినిమా కాదని ఆయన తెలిపారు. మేము వ్యాపారాలు చేసుకుంటున్నా, అక్కడ సంపాదించి ప్రజల కోసం ఖర్చుపెడుతున్నామని నాని స్పష్టం చేశారు. తాను సూటిగా పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నానన్న ఎంపీ నాని, మోదీని ఎన్ని సార్లు ప్రత్యేక హోదా కోసం కలిశారని అడిగారు. ప్రధానిని స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కలవలేదని నిలదీశారు. ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టవద్దని ఆయన పవన్ కల్యాణ్ కు హితవు పలికారు.