: చంద్రబాబు నాకు దగ్గరి వ్యక్తిగా కనిపిస్తున్నారు: జపాన్ ప్రధాని


జపాన్ ప్రధాని షింజో అబేని ఆ దేశ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు తాము సిద్ధమని చంద్రబాబుకు షింజో అబే హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా, ఏపీ రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు రావాలని జపాన్ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమర్ని ఆహ్వానిస్తూ లేఖ రాస్తారని తెలిపారు. దీనికి షింజో అబే సానుకూలంగా స్పందించారు. పలుసార్లు భేటీ కావడం వల్ల చంద్రబాబు తనకు దగ్గరి వ్యక్తిగా కనిపిస్తున్నారని ఆత్మీయత వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా షింజో అబేకు శ్రీవారి లడ్డూ, శేషవస్త్రం, మెమెంటోను చంద్రబాబు బహూకరించారు.

  • Loading...

More Telugu News