: ఈవ్ టీజర్ బెండు తీసిన ఫిలిబిత్ బాలిక!


ఫ్రెండ్స్ తో కలిసి స్కూలుకెళుతున్న ఆ బాలికను కొంతమంది ఆకతాయిలు టీజ్ చేశారు. కొంతకాలం పాటు వాళ్ల వేధింపులను ఆ బాలిక పంటి బిగువునే భరించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు వినేందుకే ఇబ్బందిగా ఉన్న బూతు పదాలను వాడటం మొదలెట్టారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న ఆ బాలిక ఫ్రెండ్స్ తో కలిసి ఇద్దరు ఆకతాయిలను బంధించి పోలీసులకు పట్టించింది. ఆ తర్వాత, తమను వేధింపులకు గురి చేసిన ఈవ్ టీజర్లను బెండు తీయకుండానే వదిలేశానన్న అసంతృప్తి ఆ బాలికను నిలబడనివ్వలేదు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మనసులోని మాటను పోలీసులకు చెప్పి అనుమతి తీసుకుంది. ఇంకేముంది, తనపై బూతు మాటలు విసిరిన ఆకతాయిని పట్టుకుని చెంపలు వాయించింది. ఒంగోబెట్టి మరీ పిడిగుద్దులు గుద్దింది. మోకాలితో డొక్కలో పొడిచింది. అయినా ఆగ్రహం చల్లారని ఆ బాలిక కాలికున్న బూటును విప్పి ముఖంపై దెబ్బల వర్షం కురిపించింది. ఇక భవిష్యత్తులో మరే బాలికనూ వేధించనని చెప్పమంటూ ఆ ఈవ్ టీజర్ ను కాళ్లు మొక్కమంటూ గద్దించింది. బాలిక వీర ప్రతాపం చూసి బెంబేలెత్తిపోయిన ఈవ్ టీజర్ తలొంచి మరీ బాలిక కాళ్లు పట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News