: గవర్నర్, సీఎం, స్పీకర్ ముగ్గురూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు: రాష్ట్రపతికి టి.కాంగ్రెస్ ఫిర్యాదు
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తన రాజకీయ ఆధిపత్యం కోసం, నియంతృత్వ పాలనను కొనసాగించడం కోసం కేసీఆర్ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. నిన్న సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ లతో కూడిన 55 మంది బృందం రాష్ట్రపతిని కలుసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై వారు ప్రణబ్ దాదాకు ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లంచాలను ఎరగా చూపడం, లేకపోతే బెదిరించడం చేస్తూ వారిని కేసీఆర్ టీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసయాదవ్ ను మంత్రిగా గవర్నర్ ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. రాజీనామా అంశాన్ని పెండింగ్ లో ఉంచిన స్పీకర్ మధుసూదనాచారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంలో తన వంతు పాత్ర పోషించారని మండిపడ్డారు.