: అంతా గందరగోళం... అసలు పుష్కరాలు ఎప్పుడు?


గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంలో గందరగోళం నెలకొంది. ఒక్కో సిద్ధాంతి ఒక్కో సమయంలో ప్రారంభమవుతాయని చెబుతుండడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇక రాజమండ్రిలో అయితే, నేడు వేలాది మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పంచాగకర్తల లెక్కల ప్రకారం ఈ నెల 14న ఉదయం 6:26 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పుష్కరాల్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా, ప్రధాని సహా పలు కేంద్రమంత్రులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాబు సర్కారు ఆహ్వానం పలికింది. ఇదే సమయంలో శ్రీశైలం దేవస్థాన ఆస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్ర దైవజ్ఞశర్మ మాత్రం పుష్కరాలు నేటి నుంచే ప్రారంభమైనాయని ప్రకటించారు. నేటి ఉదయం ఆయన గోదావరిలో పుష్కర స్నానాన్ని పూర్తి చేశారు. విజయదుర్గ పీఠాధిపతి వెదురుపాక గాడ్ సైతం నేటి నుంచే పుష్కరాలంటూ స్నానానికి వచ్చారు. మరో సిద్ధాంతి మధుర కృష్ణమూర్తి గత నెల 28నే పుష్కరాలు ప్రారంభమయ్యాయంటూ పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో సమయాన్ని చెబుతుండడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. అయితే, నదీ స్నానం ఎల్లప్పుడూ పుణ్యప్రదమే కాబట్టి ఎప్పుడు స్నానం చేసినా ఫలం సిద్ధిస్తుందని పలువురు పంచాంగకర్తలు చెబుతున్నారు. రాజమండ్రి వాసులు మాత్రం నేటి నుంచి స్నానాలు చేస్తే పుణ్యస్నానాల కిందే లెక్క అన్నట్టుగా భావిస్తున్నారు. అందువల్లే తాము నేడు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నామని తెలివిగా వివరించారు. ప్రభుత్వం ముందే స్పందించి పండితులతో చర్చించి పుష్కర ముహూర్తంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి వుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News