: మేజరువి అయితే విడాకులు ఇవ్వాలా? నీ ఇష్టమేనా?: 'పవిత్ర'కు మద్రాసు హైకోర్టు క్లాస్
గతవారం తమిళనాడులోని అంబూరులో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన కేసులో మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్ అయినంత మాత్రాన విడాకులు ఇచ్చేది లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించి సమస్యలు సృష్టించి ఆపై కోర్టుకు వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే, వేలూరు జిల్లాకు చెందిన పవిత్ర అనే యువతి అదృశ్యమైన కేసులో అంబూరు పోలీసులు షమీల్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో షమీల్ లాకప్ లో మరణించగా, అంబూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గం ప్రజలు పోలీసు స్టేషనుపై దాడులు చేశారు. విధ్వంసం సృష్టించారు. పవిత్రకు షమీల్ తో సన్నిహిత సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పవిత్ర ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసు బృందాలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె చెన్నైలో దాక్కుందని గమనించి, అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవిత్ర తనకు విడాకులు కావాలని, తాను మేజర్ నని తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు తమిళ్ వాసన్, సెల్వంలు స్పందిస్తూ, "మీ వల్ల సమాజంలో కలవరం ఏర్పడింది. మీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కున్నంత మాత్రాన, పిల్లలను వారి బాగోగులను వదిలి వెళ్లడాన్ని హర్షించరు. మీరు భర్తను వదిలి వెళ్లిపోయిన కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విడాకులు అంగడిలో దొరికే వస్తువా?" అని ప్రశ్నించారు. పవిత్ర తల్లిదండ్రులను పిలిపించి కుమార్తెను వారికి అప్పగించాలని ఆదేశించారు.